అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై

 

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

‘‘వేపచెట్టు కింద ధ్యానం చేస్తూ కూర్చుంటున్నాడే ఓ కుర్రాడు, అతను ఎవరు?’’సమాధానంగా పరుగుదీశాడు గణాచారి. అతన్ని అనుసరించారంతా. వేపచెట్టు దగ్గరకు చేరుకున్నాడతను. అప్పుడక్కడ బాబా లేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.

‘‘ఇక్కడ తవ్వండి’’ చెప్పాడు గణాచారి. వేపచెట్టు కింద చూపించాడు. ఖండోబా చెబితే చెయ్యాల్సిందే! ప్రశ్నించేందుకు అవకాశం లేదు. గ్రామస్తులు తవ్వారక్కడ. ముందు బండరాయి తగిలింది.‘‘దానిని పక్కకి తొలగించండి.’’ చెప్పాడు గణాచారి. తొలగించారు భక్తులు. కింద పెద్ద రాతిపలక కనిపించింది.‘‘దాన్ని కూడా తొలగించండి.’’ చెప్పాడు గణాచారి. తొలగించారు.

రాతిపలకను తొలగిస్తూ కింద కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. పలక కింద పెద్ద సొరంగం ఉంది. కిందికి వెళ్ళేందుకు మెట్లు ఉన్నాయి. మహల్సాపతితో పాటుగా అంతా మెట్ల మీద నుంచి కిందికి దిగారు.

చూస్తే కింది భూగృహంలో నాలుగు వైపులా నాలుగు దీపాలు ఉన్నాయి. ప్రమిదల్లో వెలుగుతూ కనిపించాయి. జపమాలలు కూడా ఉన్నాయక్కడ. అప్రయత్నంగానే చేతులు జోడించారంతా.

అంతలో అక్కడికి ఎక్కణ్ణుంచి వచ్చాడో బాబా పరుగు పరుగున వచ్చాడు.‘‘ఎవరు…ఎవరు చేశారిదంతా?’’ అడిగారు. గణాచారి దగ్గర నుంచి సమాధానం లేదు. అతను స్పృహ కోల్పోయాడు. దీనంతటికీ తనే కారణం అని మహల్సాపతి చెప్పలేకపోయాడు. భయపడ్డాడతను. ప్రజలు కూడా తలలొంచుకున్నారు.

‘‘ఇది నా గురుస్థానం. మహా పవిత్రమైంది. బంద్‌కరో! మూసేయండి.’’ అరిచారు బాబా. సొరంగం మూసేశారు. రాతి పలక మీద బండరాయిని యథాతథంగా నిలిపి ఉంచారు.వేపచెట్టు కింద ఇంత పెద్ద సొరంగమా? ఎప్పుడు తవ్వారు? ఎవరు తవ్వారు?

దీనిని తన గురుస్థానం అంటున్నాడు బాబా! అంటే బాబాకి గురువు ఎవరో ఉండి ఉంటారు. అయితే ఆ గురువు ఎవరు? అసలింతకీ ఈ బాబా ఎవరు?బాబాని ప్రజలంతా గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. మహల్సాపతి కూడా పదేపదే అడిగాడు.

అన్నిటికీ బాబా సమాధానం ఒకటే!అల్లా మాలిక్‌!ఆ రాత్రి గడిచింది. మర్నాడు తెల్లారింది. వేపచెట్టు కింద బాబా లేడు. ఏమయిపోయాడో ఎవరికీ అంతు చిక్కలేదు. ఈ సంఘటన 1854లో జరిగింది.